Sunday, August 28, 2011

శ్రీసద్గుణాన్వితా సీతాద్రిసుత వినవే - కౌశేయ, వాసుని శేషాచలవాసుని చరిత్రము

అయోధ్యా కాండము


రాగము: కర్ణాటక సారంగ - ఆదితాళము

పల్లవి:


శ్రీ సద్గుణాన్వితా శీతాద్రిసుత  వినవే - కౌశేయ, వాసుని శేషాచలవాసుని చరిత్రము


అనుపల్లవి:


భాసిల్లు నంతఃపురవరమునందు మణిసిం
హాసనస్థితుడై మునిసుతుడై - మహోల్లాసుడై దర
హాసుడై శ్రీవాసుడై శ్రిత దాసుడయి సీ
తాసహితుడగు రామునిన్ గను తలపూని సురమౌని వచ్చెను !!శ్రీ సద్గుణా!!


శరదిందుచంద్రికా సదృశమా తనుద్యుతుల
మెఱయుచు వచ్చువాని నారదునిగా
నెఱిగి సీతాజానియు దేవీయుతుడయి
పొరపొచ్చమింతలేని భక్తిచే మ్రొక్కి
పరగ బూజించి - మౌని నీదర్శన సం
స్మరణచే విషయాసక్త చిత్తులమై సం
సారచింత మాటికి గలుగు మము బోటికి
దొరక దిది దుర్లభము - నినుగని
పరమపావనుడ నైతిని భాస్కరు
డు రా దమమడగు క్రియ నజ్ఞానమడగునని ముని పల్కెను.  !!శ్రీ సద్గుణ!!


శ్రీరామ భ్రమయజేసెదవో నను లోకాను
సార వాక్యములచేను సం
సారి ననుటిది యరయ సత్యమేను జగదాదియౌ మా
యా రమణి గృహిణిగాను జేయుటను నీ సుతు
లైరి బ్రహ్మాదులెల్లను త్రిజగన్మోహ సం
సారి వీవు హరి , జనకజ లక్ష్మి పుర
వైరి వీవు సీత హిమశైలజాత
వారిజభవుడ వీవు ధరణిజవాణి రవి  వీవు ప్రభ జానకి
యారూఢి స్త్రీపురుషవాక్యములన్ని సీతయు నీ వనియెను.  !!శ్రీ సద్గుణ!!


స్వామీ నీచాయ యవ్యాకృత మనబడునది
యే మూలప్రకృతిధాన మహత్తత్త్వ
మా మహత్తత్త్వానలింగశరీర
మై మఱి యది సకలమైన తనువుల జేసె న
హంకారబుద్ధి ప్రాణాజ్ఞాన కర్మేంద్రియ
సాముదాయకము లింగ శరీ
ర మనబడునదే జన్మకర్మమూ
లము ఇంద్రజాలము ఆ మహాత్మయె జీవ
సంజ్ఞననాద్యవుద్యో పాధి నొందిన
దై మించె స్థూలాది దేహ త్ర
యమె జీవో పాధి యనియును.   !!శ్రీ సద్గుణ!!


స్థూలసూక్ష్మ కారణాల జాగ్రత్స్వప్న సుషుప్తవ
స్థలు మూడు గల్గె, నీ సంసృతి
లీలచే నెనయువాడు జీవుడె పరమాత్మ త్రి
కాలసాక్షి యీ రేడులోకముల కాది
మూల మది నీవేచూడు మాయాభువనజాత
ములు నీయందె జనన స్థితిలయ
ములై జరుగుచున్నవి రామా రాక్షస విరామా
వ్యాళమని త్రాడుగని బెదరిన,
పోలికను దను జీవు డనుకొను
బాలిశుడు ఘను డాత్మ తానని భయరహితుడయి
యలరు ననియెను.   !!శ్రీ సద్గుణ!!


ఏ నీ తేజమున నీయఖిలమును వెలు
గునిది ఖలుడు తెలియలేకదేహమే పతి
యనియెంచు పుణ్యశ్లోక యెందాక
జ్ఞానము తెగిపోక యుండునందాక
దీనుడగు జనుడు నీ కారుణ్యమున వి
జ్ఞానానంద మొదవిన నరు
డౌ నది నీపాదారవింద భ
క్తిని కలుగునదియు ము
క్తి నిధానమగు రామ నీ దాసుల దాసుడను కరుణను బ్రోవుము
నీ నాభి కమలజుడు మా తండ్రి యటుగాన నే పౌత్రుడననె.  !!శ్రీ సద్గుణ!! 


అని చాల ప్రణతుడై యానందభాష్పములు
కనుల జడిగొన జడధారి రఘువంశతిలకుని
వినుతించె వేడ్క జేరి రావణవథార్థము
జనియించినావు శౌరి దశరథుడు నిన్ను
జనవిభుని జేయగోరి యున్నాడటుల
యిన రావణుడు జచ్చుటెటు ల
తనిం జంపుదు నని ప్రతిజ్ఞ జేసినావు మునుడాసి
వినుము భూభారహరణమునకు
మొనయు మిది వనజభవు వాక్యము
ననిన జిఱునగవు మొగమున జిగి
బెనగొనగ ననియె రాముడు    !!శ్రీ సద్గుణ!!


విను నారద నేనెఱుగని దేమియును లేదు
మును ప్రతిన నాచేత నెటు చేయబడె నటు
లనే జేతు సకలభూతముల సుఖాసుఖములు
ఘనకాలసంజాతములు ప్రారబ్ధ
మున నగునవి భువన నే
తనై తగులక నేనే నెనసి వినోదిం
తు నిదె రేపు దండకాటవి కేగి
మునివేషము దాల్చి సంతోషము
నను చతుర్దశ వత్సరము లుందును సీత
యను నెపమునను రా
వణుని సబలముగ జంపుదు
నన విని జనె మునీంద్రుడు .  !!శ్రీ సద్గుణ!!


ఇక్కడ అయోధ్యాకాండ ప్రారంభమయినది. 
అంతఃపురంలో మణిసింహాసనమునందు సీతాసమేతుడై ఉన్న శ్రీరామచంద్రుని దర్శనానికై నారదమహర్షి వచ్చి ఆయనను దర్శించి ఆయనకు తన అవతార పరమ లక్ష్యమైన రావణవథను గూర్చి గుర్తు చేసి వెళ్తాడు.  శ్రీరామ చంద్రుడు తాను రావణసంహారము సీతాదేవి నెపముతో చేస్తానని చెప్తాడు.






  



No comments:

Post a Comment